Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష కార్యదర్శులుగా వేపకుంట్ల వెంకటేశ్వర్లు, బొడ్డు సతీష్‌లు
- ఆదివాసీ నాయకపోడుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి
- పసల బుచ్చయ్య
నవతెలంగాణ-కామేపల్లి
ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం సమావేశం ఆదివారం మండల పరిధిలోని పింజరమడుగు గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసల బుచ్చయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నాయకపోడు ఆదివాసీల బతుకులు ఆగమ్యగోచరంగా ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులు, చట్టాలు పకడ్బందీగా అమలు కావడం లేదని, ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ఆదివాసీలకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం 11 ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసి సాంప్రదాయ పండుగలు, జాతరల నిర్వహణకు ఐటీడీఏ ద్వారా నిధులు కేటాయించాలని కోరారు. ఎనుకబడిన గిరిజన ఆదివాసీ నాయకపోడుల గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అనంతరం కామేపల్లి మండల నూతన కమిటీ అధ్యక్షుడుగా వేపకుంట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గా బొడ్డు సతీష్‌లతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు సంగం నాగేశ్వరరావు, దబ్బా రామారావు, భోగి వీరస్వామి, సంగం నాగరాజు, రావుల శ్రీనివాసరావు, జిల్లా నాయకులు రాస శ్రీను, కిన్నెర రామచంద్రయ్య, సంగం వెంకన్న పాల్గొన్నారు.