Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మంలో 10స్థానాల్లో పోటీ చేస్తాం
- సత్తుపల్లి, అశ్వారావుపేటలను గెల్చుకు తీరతాం
- టీడీపీ క్రమశిక్షణ సంఘం జాతీయ
అధ్యక్షులు బంటు, నన్నూరి
- సత్తుపల్లిలో 'మినీ మహానాడు' సదస్సు
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలుగుదేశానికి సత్తుపల్లి అడ్డా అని, రానున్న ఎన్నికల్లో సత్తుపల్లితో పాటు అశ్వారావుపేట స్థానాలను కైవశం చేసుకొని తెలుగుదేశం జెండాలను రెపరెపలాడించాలని టీడీపీ క్రమశిక్షణ సంఘం జాతీయ సభ్యులు, బంటు వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం సత్తుపల్లిలోని మాధురి ఫంక్షన్హాలులో జరిగిన మినీ మహానాడు సదస్సులో వారు మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో ఉంటారని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలపై ప్రత్యేక దృష్టి మళ్లీ గెల్చుకు తీరతామన్నారు. ఎందుకంటే ఇక్కడి ఈ రెండుస్థానాల్లో టీడీపీ నుంచి గెల్చిన ఇద్దరూ బీఆర్ఎస్లోకి ఫిరాయించారన్నారు. వారు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ కేడర్ ఎక్కడికి పోలేదన్నారు. ప్రజల్లో తెలుగు రక్తం ప్రవహిస్తూనే ఉందన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని మర్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అలాగే ఉండిపోయాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 9యేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తెలుగుదేశం అంటేనే ఎన్టీ రామారావని,
ఈ రెంటిని కేసీఆర్ ప్రభుత్వం వేరుగా బాధాకరమన్నారు. ఇప్పుడెందుకో ఎన్టీఆర్పై ప్రేమ పుట్టుకొస్తుందన్నారు. రానున్న రోజుల్లో తెలుగు తమ్ముళ్లు అహౌరాత్రులు కష్టించి రామరాజ్యం తీసుకురావాలన్నారు. ఈ సదస్సు ప్రారంభానికి ముందు పట్టణంలోని వెంగళరావునగర్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం, రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పూల అశోక్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమూర్తి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం, రాష్ట్ర కల్చరల్ అధ్యక్షుడు చంద్రహాసన్, సత్తుపల్లి నాయకులు బొంతు శ్రీనివాసరావు, పోట్రు రామారావు, ముప్పిడి శ్యామ్ సుధాకర్, రాచర్ల చందూ, కోట సత్యనారాయణ పాల్గొన్నారు.