Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులమేదైనా మంచిని స్వీకరించాలి..మంచి చేయాలి
- ఖమ్మంలో రెడ్డి సంక్షేమ భవన్ కు రూ.కోటి విరాళం
- రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సన్మానంలో ఎంపీ బండి పార్థసారథిరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మనం చూపే ప్రతిభతోనే మనకు గుర్తింపు వస్తుందని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి అన్నారు. కులమేదైనా మంచిని స్వీకరించాలి.. నలుగురికి మంచి చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆత్మీయ సన్మాన మహౌత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం ఎదుగుతూ మరో 10 మందికి నీడను ఇవ్వాలని అన్నారు. విద్యా, వైద్యం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలుపుతూ... రెడ్డి సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు ఖమ్మంలో రెడ్డి సంక్షేమ భవన్ నిర్మాణానికి రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏ అంశంలోనైనా మనం చూపించే ప్రతిభాపాఠవాలే మనకు గుర్తింపు తెస్తాయని తెలిపారు. కులమేదైనా మంచిని స్వీకరించాలని.. చెడుకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. భవిష్యత్తులో కులాలు అంతరించక తప్పదు అన్నారు. పిల్లలకు వారసత్వంగా ఆస్తులను కాకుండా వారి కాళ్లపై వారే నిలబడే శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని సూచించారు. ప్రపంచ నాల్గో అపర కుబేరుడు వారెన్ బఫెట్ పిల్లలు తమ తండ్రి నుంచి ఆస్తిని కాకుండా ఆశయాన్ని పునికి పుచ్చుకున్నట్లు వివరించారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ సభ్యుల వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఏటా రూ. 8000 కోట్ల నుంచి రూ.పదివేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ప్రజాధన దుర్వినియోగ దష్ట్యా ఆర్థిక స్తోమత ఉన్న సభ్యులు దీనిని తిరస్కరించ వచ్చన్నారు. శ్రీమంతులైన సభ్యులు సైతం దీనిని స్వీకరిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ... పైసా ప్రభుత్వ ఖర్చు ఆశించకుండా ప్రజాసేవ చేసేందుకే తాను రాజ్యసభ సభ్యత్వం స్వీకరించినట్లు తెలిపారు. తనకు బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రికి గౌరవం దక్కేలా తన నడవడిక ఉంటుందన్నారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఎంపీ పార్థసారధి రెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు శీలం వెంకట్ రెడ్డి, ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, నూకల నరేష్ రెడ్డి, వంగ సాంబశివారెడ్డి, గ్లోబల్ రెడ్డి ఫెడరేషన్ నాయకులు మంజునాథరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బండి గురునాథరెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, గాదె మాధవరెడ్డి, రిటైర్డ్ ఆర్టీవో కృష్ణారెడ్డి, కార్పొరేటర్ దండా అయప్పరెడ్డి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.