Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలు గడుస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-అశ్వాపురం
మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా ఆధార్ కేంద్రాలు మూసివేయడంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. గతంలో మండల రెవెన్యూ కార్యాలయంలో ఒకటి, మండల పరిషత్ కార్యాలయంలో మరొకటితో కలిపి రెండు ఆధార్ కేంద్రాలు ప్రజలకు సేవలు అందించడంతో మండల ప్రజలు ఆధార్‌కు సంబంధించిన ఏమైనా అవసరాలుంటే సునాయాసంగా పనులు చేయించుకొని వెళ్లేవారు. ప్రస్తుతం గత కొన్ని నెలలుగా ఈ ఆధార్ కేంద్రాలు మూసివేయడంతో మండలంలోని సమస్యలపై వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మండల కేంద్రంలో ఈ సేవలు అందుబాటులో లేకపోవడంతో పక్కనున్న భద్రాచలం, మణుగూరు వంటి పట్టణాలకు ఆధార్ సమస్యలతో వెళుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో జనం అధికంగా ఉండడంతో ప్రజలు రెండు మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆధార్ కేంద్రాలను పునరుద్ధరించాల్సిన సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
భద్రాచలం, మణుగూరు వెళ్లాలంటే
ఆర్థిక భారం పెరుగుతోంది
మండల కేంద్రంలో ఇంతకాలం ఆధార్ సేవలు కొనసాగడంతో తమకు ఎటువంటి అవసరం వచ్చినా ఇబ్బంది లేకుండా అవసరాలను సునాయాసంగా తీర్చుకునేవారుమని మండల ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా రెండు ఆధార్ సెంటర్లను మూసివేయడంతో భద్రాచలం, మణుగూరు వంటి పట్టణాలకు వెళ్లి ఆధార్ పనులను చేయించుకోవాలంటే ఆర్థిక భారం పెరుగుతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి మండల కేంద్రంలో ఓ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.