Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ క్లిష్ట సమయంలోనే ఈ పరిస్థితి లేదు..
- రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం...
- మక్క కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోళ్ళలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. ఇప్పటి వరకు కేవలం 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనడమేంటని ప్రశ్నించారు. ఇంత తక్కువ కొనడమేంటని అడిగారు. ధాన్యం, మొక్కజొన్న సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని సూచించారు. ఐడిఓసిలోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా దాదాపు 2లక్షల పై చిలుకు ధాన్యం సేకరణ కేంద్రాలకు వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు లెక్కల ప్రకారం నమోదు అయిందన్నారు. ధాన్యం సేకరణలో బాగా వెనుకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ లేదన్నారు. కొత్త కొత్త పాలసీలు తెచ్చి రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వంతో ఉన్న సమస్యలను రైతులపై రుద్ది ఇబ్బంది పెట్టాలని చూస్తే అందుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని మిల్లర్లను హెచ్చరించారు. కరోనా క్లిష్ట సమయంలోనే 3 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇప్పుడు దాన్ని అందుకోలేకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. మిల్లర్లు తరుగు పేరుతో 4 కిలోలు తీసేయడం సరికాదని సూచించారు. ధాన్యం రవాణాలో అంతరాయం, అవాంతరాలు కలిగిస్తే చర్యలకు వెనుకాడేది లేదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి గింజను మద్దతు ధరతో కొనాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సేకరణ చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు. మండలానికి ఒక్కటి చొప్పున మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలన్నారు.
236 కేంద్రాలకు 232 ప్రారంభం: కలెక్టర్ వీపీ గౌతమ్
జిల్లాలో 236 ధాన్యం సేకరణ కేంద్రాలకు గాను 232 ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. 130 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి, 4,220 మంది రైతుల నుండి 40477. 520 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు సేకరించినట్లు వివరించారు. తడిసిన ధాన్యం సేకరణకు 9 పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ట్యాగ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 41 మొక్కజొన్న సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 31 పీఏసీఎస్, 10 డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ మధుసూదన్, ట్రెయిని ఐపీఎస్, డిఆర్డీవో విద్యా చందన, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయకుమారి, జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ సోములు, జిల్లా మార్కెటింగ్ అధికారి కోలాహలం నాగరాజు, జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ పి. సునీత, జిల్లా వ్యవసాయ శాఖ ఏడి సునీత, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, సత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.