Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నవతెలంగాణ- ఖమ్మం
నివారించదగిన అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం రాపర్తి నగర్లోని షైన్ ఇండియా పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం క్రింద శుక్రవారం నాటికి 4 లక్షల 86 వేల 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన అన్నారు. ఇందులో 2 లక్షల 30 వేల 813 మంది పురుషులు, 2 లక్షల 53 వేల 330 మంది స్త్రీలు, 1,809 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారన్నారు. 405 గ్రామ పంచాయతీలు, 90 వార్డుల్లో కార్యక్రమం పూర్తి చేసినట్లు, 40 గ్రామ పంచాయతీలు, 15 వార్డుల్లో పురోగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష అనంతరం లక్షా ఒక వేయి 780 మందికి రీడింగ్ కళ్ళద్దాలు , 65 వేల 704 మందికి ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు అవసరం గుర్తించి, ఆర్డర్ అనంతరం 48 వేల 486 మందికి ఆందజేసినట్లు ఆయన అన్నారు. 3 లక్షల 18 వేల 614 మందికి కంటి సమస్యలు లేనట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి మంచి స్పందన ఉందన్నారు. ఇప్పటికి 69 రోజుల కార్యక్రమం పూర్తయినట్లు, ఇంకనూ 31 రోజులు కార్యక్రమం కొనసాగ నున్నట్లు తెలిపారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి, కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.