Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికలదే పైచేయి
- సెకండియర్లో ఖమ్మం 4, భద్రాద్రి 6వ స్థానం
- ఖమ్మంలో 74, కొత్తగూడెంలో 73శాతం ఉత్తీర్ణత
- ఫస్టియర్లో ఖమ్మం 7, భద్రాద్రి 12వ స్థానం
- ఖమ్మం 67, కొత్తగూడెం 60శాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. సెకండియర్ జనరల్ విభాగంలో ఖమ్మం 74శాతం ఉత్తీర్ణతతో నాలుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 73శాతం ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలిచాయి. ఫస్టియర్లో ఇరు జిల్లాల స్థానాలు కాస్త దిగజారాయి. ఖమ్మం 67శాతం ఫలితాలతో ఏడు, కొత్తగూడెం జిల్లా 60 ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ ఓవరాల్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఎంపీసీలో ఖమ్మం కృష్ణవేణి కళాశాల విద్యార్థి పి.రాజేష్ ఎంపీసీలో 994, శ్రీచైతన్య కళాశాలలకు చెందిన రాయపాటి ఉషశ్రీ, లోకేష్ 992 మార్కులతో సత్తా చాటారు. అలాగే రెజోనెన్స్ కళాశాల విద్యార్థిని పి.లక్ష్మీసాయి 992 సాధించింది. న్యూవిజన్ కళాశాల విద్యార్థులు కావ్య, అఖిలేష్ 991 మార్కులు సాధించారు. బీపీసీలోనూ శ్రీ చైతన్య కళాశాలకే చెందిన గాయత్రి, పూజిత 992 మార్కులు సాధించడం గమనార్హం. న్యూవిజన్కు చెందిన గాయత్రి, మలీహా తక్ధీర్ 990 మార్కులు సాధించారు. ఎంఈసీలో తేజశ్రీసాయి 985, సీఈసీలో 963తో నిఖితాదాస్ మెరిశారు. ఖమ్మంలోని ఏఎస్ఆర్ కళాశాల విద్యార్థిని వి.స్ఫూర్తి బీపీసీలో ప్రభుత్వ కళాశాలల నుంచి 990తో టాపర్గా నిలువగా, బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన వి.నిఖిల్ 984 (ఎంపీసీ) మార్కులతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో పలువురు విద్యార్థులు 467/470, బైపీసీలో 434/440 మార్కులు సాధించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో 71శాతం ఫలితాలు రాగా ఈ ఏడాది 74శాతం సాధించటం గమనార్హం.
సత్తాచాటిన ఖమ్మం...
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం 4, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఏడో స్థానంతో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. సీనియర్ ఇంటర్లో మొత్తం 13,339 మంది విద్యార్థులకు 9,964 (74%) మంది ఉత్తీర్ణులయ్యారు. దీనిలో 6,900 మందికి గాను 5,530 (80%) మంది పాసయ్యారు. బాలురు 6,439 మందికి 4,434 (68%) మంది ఉత్తీర్ణులయ్యారు. జూనియర్ ఇంటర్లో ఖమ్మం ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 15,450 మందికి 10,456 (67%) ఉత్తీర్ణులయ్యారు. దీనిలోనూ బాలికలే పైచేయి సాధించారు. 7,771 మందికి 5,634 (72%) గర్ల్స్ ఉత్తీర్ణులయ్యారు. బాలురు 7,679 మందికి 4,822 (62%) ఉత్తీర్ణత సాధించారు.
భద్రాద్రి పర్వాలేదు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఫలితాల్లో పర్వాలేదనిపించింది. సీనియర్ ఇంటర్లో 76% ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 6,984 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 5,103 (76%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 4085 మందికి 3,145(76%), బాలురు 2,899కి 1,958 (67%) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జిల్లా 12వ స్థానంలో ఉంది. జిల్లా నుంచి 7,999 మందికి 4,865 (60%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 4,438 మందికి 2,997 (67%), బాలుర 3,561కి 1,868 (52%) ఉత్తీర్ణత సాధించారు.
వృత్తి విద్యా ఫలితాలు ఇలా...
వృత్తివిద్యా కోర్సుల ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 76% ఉత్తీర్ణతతో ఐదో స్థానంలో ఉండగా ఖమ్మం జిల్లా 73% ఫలితాలతో 11వ స్థానంలో నిలిచింది. భద్రాద్రి నుంచి 1943 మందికి 1484 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 66%, బాలికలు 84% పాసయ్యారు. ఖమ్మం జిల్లాలో 2071 మందికి 1,521 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 64, బాలికలు 83% ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో 57% ఫలితాలతో భద్రాద్రి 9వ స్థానంలో ఉండగా 56% ఉత్తీర్ణతతో ఖమ్మం జిల్లా 11వ స్థానంలో నిలిచింది. కొత్తగూడెం నుంచి 2,363 మందికి 1,364, ఖమ్మం నుంచి 2,446కు 1,370 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఖమ్మం జిల్లా 64% ఫలితాలు మాత్రమే సాధించగా ఈ సంవత్సరం 73% సాధించింది.
గురుకుల కళాశాలల ఫలితాలు ఇలా...
ఖమ్మం జిల్లాలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. సీనియర్ ఇంటర్లో 90.2%, జూనియర్ ఇంటర్లో 71.15% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 13 రెసిడెన్షియల్ కళాశాలల నుంచి 786 మందికి గాను 709 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 988 మందికి గాను 703 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాంతీయ అధికారి కె.ప్రత్యూష అభినందనలు తెలిపారు.