Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపోతున్న అన్నదాతలు
- మార్క్ పెడ్ నిబంధనలతో రైతులు అవస్థలు
- గణనీయంగా తగ్గిన పంట దిగుబడి
నవతెలంగాణ - బోనకల్
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒకవైపు అకాల వర్షం పాలైంది. మరోవైపు కొద్దో గొప్ప చేతికి వచ్చిన పంట ప్రైవేటు వ్యాపారుల పరం అవుతుంది. మార్క్ పెడ్ నిబంధనలతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆ కష్టాలు పడలేక అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. బోనకల్ మండలంలో ఈ ఏడాది యాసంగి లో 15,277 ఎకరాలలో అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే మార్చిలో కురిసిన అకాల వర్షాల వలన మండల వ్యాప్తంగా 6,226 మంది రైతులకు చెందిన 7,909 ఎకరాల మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. సహజంగా ఎకరానికి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. అకాల వర్షం వల్ల మొక్కజొన్న నేలకొరకటంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరానిక 20 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చిందని అన్నదాతలు అంటున్నారు. అంటే ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది. అంతకుముందే సాగునీటి సమస్యతో అనేక గ్రామాలలో మొక్కజొన్న పంట ఎండిపోయింది. దీని ఫలితంగా పంట దిగుబడి కూడా సగానికి పైగానే పడిపోయింది. అకాల వర్షం వల్ల 7,909 ఎకరాలకు గాను1 ఒక లక్ష 18 వేల క్వింటాల దిగుబడి తగ్గిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది ఇలా ఉండగా అరకొరగా చేతికి వచ్చిన మొక్కజొన్న పంటను కూడా ఇటీవల వచ్చిన వర్షాలు మరికొంత దెబ్బతీశాయి. మండలంలో అకాల వర్షం వల్ల నేల పాలైన మొక్కజొన్న పంటను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 23వ తేదీన పంటలను పరిశీలించారు. పంట చేతికి వచ్చిన సమయంలో ప్రభుత్వం ఎక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు 1500 నుంచి 1650 రూపాయల వరకు కొనుగోలు చేశారు. రైతులందరూ మొక్కజొన్న పంటను సగానికి పైగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్న తర్వాత రైతు సంఘాల వివిధ పార్టీల డిమాండ్ తో మండలంలో గల తొమ్మిది సహకార సంఘాలలో కేవలం రెండు సంఘాలలో మాత్రమే మార్క్ పెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్క్ పెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అనేక నియమ నిబంధనలో విధించారు. క్వింటాకు 1962 రూపాయల ధర నిర్ణయించారు. అదేవిధంగా ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే రైతు నుంచి కొనుగోలు చేయాలని నిబంధన విధించారు. 14 శాతం లోపు తేమ ఉండాలన్నారు. రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినప్పటికీ ఒకే రోజు కేవలం 50 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన విధించింది. ఒకవేళ ఇంకా మిగిలిన మొక్కజొన్నలు ఏమైనా ఉంటే మరో రోజు మాత్రమే వాటిని కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తారు. దీంతో పాటు రైతులను తీవ్రంగా దెబ్బతీసే మరో నిబంధన విధించారు. పొలం ఎవరి పేరుతో ఉంటే వారి పేరుతోనే నగదు జమ చేయడం జరుగుతుందని మార్కె పెడ్ అధికారులు స్పష్టం చేశారు. దీనివలన కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌలు రైతులు పొలం యజమాని చుట్టూ తాను పండించిన పంటల నగదు కోసం తిరగవలసిన పరిస్థితిని ప్రభుత్వమే కౌలు రైతులకు కల్పించింది. మార్క్ ఫెడ్ లో అధికారులు విధించిన నియమ నిబంధనల వలన పంట సాగు చేసిన కౌలు రైతులు ఈ ఇబ్బందులు పడలేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీని వలన రైతులు ఎంతో నష్టపోతున్నారు. రైతులకు లాభం చేకూర్చే నిబంధనలను విధించకుండా ప్రధానంగా కౌలు రైతులకు నష్టం చేకూర్చే నిబంధనలు అమలు చేయడం పట్ల ఆ రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం ప్రభుత్వ నిబంధన వలన చివరకు ప్రైవేటు వ్యాపారులకే మేలు జరుగుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఆన్ లైన్ లో మొక్కజొన్న పంట సాగు చేసినట్లు ఉండాలి. లేకపోతే ఆ పంటను కొనుగోలు చేయరు. ఒకవేళ పంట సాగు చేసిన రైతు ఆన్ లైన్ లో నమోదు చేయకపోతే ఆ రైతు పరిస్థితి మరి దారుణం.
ఐదున్నర ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశా : సావిటి లింగయ్య, రైతు, చిరునోముల
ఐదున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంటను సాగు చేశాను. అకాల వర్షం వల్ల మొత్తం పంట నేలమట్టం అయింది. ఎకరానికి 38 వేల వరకు పెట్టుబడి అయింది. ఎకరానికి 35 క్వింటాలు దిగుబడి రావాల్సి ఉండగా పంట నేలమట్టం కావడంతో 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున పంట నష్టం జరిగింది. మొత్తం మీద 80 క్వింటాళ్ల దిగుబడి పడిపోయింది. సకాలంలో మార్క్ పెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటా 1610 రూపాయలకు అమ్ముకున్నాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వలన క్వింటాకు 352 రూపాయలు చొప్పున నష్టపోయాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వలన 106 క్వింటాలకు గాను సుమారు 40 వేల రూపాయలు నష్టపోయాను. దీనకి తోడు ఎకరానికి కౌలు 15 వేల రూపాయలు చెల్లించాను. మండల వ్యాప్తంగా పంటలో సుమారు 80 శాతం వరకు అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకున్నారు. రైతుల ఎక్కువ శాతం పంట ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్న తర్వాత హడావుడిగా ప్రభుత్వం సహకార సంఘాలలో మార్క్ పెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం వలన రైతులకు జరిగిన ఉపయోగం ఏమీ లేదు.