Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరాలో కార్యదర్శుల నినాదం
నవతెలంగాణ-వైరా
తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళ వారం నియోజక వర్గ కేంద్రం వైరాలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. డ్యూటీలో చేరక పోతే ఊస్టింగ్ తప్పదని తమ ఇళ్లకు నోటీసులు అంటించటం నిరంకుశ చర్య అని విమర్శించారు. విధుల్లో చేర్చుకునే రోజు మూడు సంవత్సరాలు ప్రొహిభిషన్ పీరియడ్ అని చెప్పిన ప్రభుత్వం 2022 మార్చి ఏప్రిల్ నెలల్లో మరొక సంవత్సరం ప్రోహిభిషన్ పీరియడ్ లో ఉండాలని, ఆ తర్వాత రెగ్యులర్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి గా ప్రకటించారని, కాని ఏప్రిల్ చివరిలో కూడా రెగ్యులర్ చేసే చర్యలు చేపట్టని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు అనివార్యంగా దిగవలసి వచ్చిందని ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం తెలిపింది. మంగళవారం వైరా లో వైరా, కొణిజర్ల, సింగరేణి, ఏన్కూర్, తల్లాడ మండలాల కార్యదర్శులు ఎంపిడిఓ కార్యాలయం నుండి మధిర రోడ్డు లోని గురుకుల పాఠశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. మధ్యలో క్రాస్ రోడ్డు నందు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ ల నాయకులు సంఘీభావం ప్రకటించి ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, చప్పిడి వెంకటేశ్వర రావులు పాల్గొని ప్రసంగించారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఉద్యోగ ఊస్టింగ్ బెదిరింపులకు దిగటం, నోటీసులు ఇంటి తలుపులకు అంతించటం వంటి నిరంకుశ చర్యలను బొంతు రాంబాబు ఖండించారు. ఉద్యోగ భద్రత ను కోరడం కూడా ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తే దాన్ని నిరంకుశ చర్య గానే పరిగణించాలని అన్నారు. ప్రభుత్వం కనీసం సంఘ బాధ్యులతో కూడా చర్చలకు జరపటానికి ఇష్టపడక పోవటం ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వానికి తగని పని అన్నారు. రెగ్యులర్ చేయమని అడగటం గొంతెమ్మ కోర్కెకాదని, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. శీలం వెంకట నర్సిరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ఉద్యోగాన్ని ఊడబీకుతానన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమే నని ఎవరూ ఇంత చులకనగా మాట్లాడరని అన్నారు. నిరుద్యోగ సమస్య నుండి బయట పడటానికి రకరకాల ఉన్నత చదువులు చదివిన వారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా చేరారని, కాని ఉద్యోగ భద్రత కోసం అడిగితే అసలే పీకేస్తామనటం దుర్మార్గమని, ఒకరికి చెప్పే నీతులు ముందు నీకు వర్తింపజేసుకుని మాట్లాడితే జనం మెప్పుగా ఉంటుందని పారుపల్లి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఒపిఎస్లను జేపిఎస్లుగా మార్చి రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేసి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలని నినదించారు. సంఘం నాయకులు జి లోకేశ్వరి, బి తిలక్ కిషోర్, సీమశ్రీ, అనురాధ, సంతోష్, రవీందర్ లాల్, ఉపేందర్ గౌడ్, బి సాయి కుమార్, నాగరాజు, ఎం సుధీర్, సురేష్, అబ్దుల్ రహీం, రామకృష్ణ, ప్రశాంత్, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.