Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తునికాకు బోనస్‌ల పేరుతో పార్టీ
- గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం మండిపాటు
నవతెలంగాణ-పినపాక
తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, పొదెం వీరయ్యను విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని పినపాక మండలం కాంగ్రెస్ అధ్యక్షులు గోడిషాల రామనాథం అన్నారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గిరిజనులు, వలస ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను ఎందుకు లాక్కున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్ పరంగా వారికి ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని, పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల సమయంలో తప్ప వలస ఆదివాసులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెంలో ఏర్పాటుచేసిన తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని ప్రసంగిస్తూ పార్టీ గురించి, ఎన్నికల గురించి మాట్లాడుతుండగా దానిని ఖండించిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను నువ్వు అని సంబోదించడం పద్ధతి కాదని, వారిని అనే స్థాయికి కూడా మీకు లేదని హెచ్చరించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని అటువంటి కార్యక్రమంలో పార్టీల గురించి, ఎన్నికల గురించి ప్రస్తావన రాకూడదని కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలవదా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సెల్ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు ఎండి బషీరుద్దీన్, పినపాక మండలం మండల మహిళా అధ్యక్షురాలు పాయం సమ్మక్క, ఉపాధ్యక్షులు అత్తి లక్ష్మీనారాయణ, కొంబతిని శ్రీను, యలం బుజ్జిబాబు, చంటి, కొమరం, పడిగా సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు.