Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ విప్
నవతెలంగాణ -ఆళ్ళపల్లి/గుండాల
పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గురువారం గుండాల, ఆళ్ళపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించి, ఉమ్మడి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ముందుగా గుండాల మండలంలో శెట్టిపల్లి గ్రామం నుండి లింగాపురం గ్రామం వరకు సుమారు రూ.6 కోట్ల 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఆర్ అండ్ బీ రోడ్డు నుండి మటన్టంక గ్రామం రహదారి మధ్య ఉన్న తొట్టివాగుపై సుమారు 2 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన, మండలంలో చిన్న వెంకటాపురం గ్రామం నుండి మల్లెలగుంపు రహదారి నడుమ ఉన్న కిన్నెరసాని వాగుపై హై లెవెల్ వంతెన సుమారు 3 కోట్ల 80 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీరాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో వెంకటాపురం గ్రామ సమీపంలో సుమారు కోటి 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను, దాంతో పాటు కొడవటంచ నుండి నడిమిగూడెం మీదుగా పాలగూడెం, నాగారం గ్రామాల వరకు సుమారు 5 కోట్ల 72 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. చింతలపాడు సమీపంలో లెవెల్ కల్వర్టుకు 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో లెవెల్ రోడ్డు డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శెట్టుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డికి 28 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 81 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు.
తదనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆళ్ళపల్లి మండల పరిధిలోని చంద్రాపురం గ్రామానికి ఆర్ అండ్ బి రోడ్డు కు మధ్య జల్లేరు వాగుపై డీఎంఎఫ్ టీం నిధులు రూ.4 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మండల పరిధిలోని మర్కోడు గ్రామం నుండి భట్టుపల్లి గ్రామాల మధ్య గ్రావెల్ రోడ్డు పై మూడు చోట్ల కల్వర్టులు, రెండు గుట్టల పై సీసీ రోడ్ల నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు రూ.3కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఏజెన్సీ ప్రాతాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయని అన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం హర్షణీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి రైతు బీమా, రైతు బంధు పథకాలతో ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, ఆర్అండ్బి ఏఈ రాంబాబు, విద్యుత్ శాఖ ఏఈ రమేష్ బాబు, సర్పంచ్ లు గొగ్గెల ప్రేమకళ, శంకర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎండీ.అతహార్, బుర్ర వెంకన్న, ఎండీ.ఖయ్యూం, తదితరులు పాల్గొన్నారు.