Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమయాక ఆదివాసీలను పోలీసులపైకి ఉసిగొలుపుతున్నారు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జీ
నవతెలంగాణ-కొత్తగూడెం
జల్, జంగిల్, జమీస్ పేరుతో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం క్రింది స్థాయి నాయకులు, సభ్యులను బలి చేస్తున్నారని, అమాయకపు ఆదివాసి యువతీ, యువకులను పార్టీలోకి చేర్చుకొని పోలీసులపై దాడికి ఉసిగొలుపుతున్నారని, మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల కుట్రను గమనించి క్రింది స్థాయి నాయకులు, దళ సభ్యులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు.గురువారం జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు తమ కుటుంబాల కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం, విలాసవంతమైన జీవితాలను గడపడం కోసం అమాయకులైన క్రింది. స్థాయి నాయకులను, దళ సభ్యులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని వెల్లడించారు. అమాయకపు ఆదివాసి యువతీ, యువకులను బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని వారి చేతికి తుపాకులు,పేలుడు సామాగ్రి ఇచ్చి పోలీసులపై దాడి చేయడానికి పంపుతూ వారికి జీవితాలే లేకుండా! చేస్తున్నారని, కాంట్రాక్టర్లు, రైతులు, నాయకులను బెదిరిస్తూ అమాయకులైన క్రింది స్థాయి కేడర్ తో డబ్బులు వసూలు చేయిస్తున్నారన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ స్వార్థప్రయోజనాల కోసం పన్నిన కుట్రను గ్రహించని కింది స్థాయి అమాయక దళనాయకులు, సభ్యులు ప్రభుత్వాలు చేపడుతున్న అభివద్ధి పనులను అడ్డుకుంటున్నారు. అమాయకులైన రైతులను చంపడం, ఆదీవాసీలు సంచరించే ప్రదేశాల్లో బాంబులు పెట్టి మూగజీవాలను బలితీసుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇన్ఫార్మర్ల నెపంతో తమ ఆదివాసీలనే చంపడం, పోలీసులపై దాడులు చేయడం లాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్నారు. పార్టీలోకి చేర్చుకుని వారి చేతికి తుపాకులు ఇచ్చి మావోయిస్టులుగా తయారుచేసి పోలీసులపై దాడి చేయడానికి ఉసిగొలిపి వారు మరణించడానికి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులే కారణమయ్యారని, ఎదురు కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి మరణాలకు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులే బాధ్యత వహించాలన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల కుట్ర తెలియక మరణించిన కింది స్థాయి కేడర్ కుటుంబాలకు అగ్రనాయకులే సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల కుట్రను గమనించి దళ సభ్యులు లొంగిపోయి తమ కుటుంబాలతో కలిసి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుండి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందేలా జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.