Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల కేంద్రంలోని కంగాల బుచ్చయ్య భవన్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం హాజరై మాట్లాడుతూ మే 19, 20, 21 తేదీల్లో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు కొత్తగూడెం పట్టణ కేంద్రంలో, టీచర్స్ భవన్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 3 రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో 100 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్యనాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో విద్యా సంవత్సరం జూన్ నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అనేక రాష్ట్ర, దేశ విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. పలు సమస్యలపై తీర్మానాలు చేసి, ఆయా సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు పోరాటాలు రూపకల్పన చేయబోతున్నామని అన్నారు. 2022-23 విద్యా సంవత్సరం పూర్తైనా కనీసం విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు కూడా చెల్లించలేదన్నారు. పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారి లేని కారణంగా పాఠశాల విద్య గాడితప్పిందన్నారు. పదవతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనకబడిందన్నారు. జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయని, మన ఊరు-మన బడి పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. అధికారులకు పేద విద్యార్థుల చదువుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అర్హతల్లేని ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అర్హతల్లేని ప్రిన్సిపాళ్ళు, సిబ్బందితో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. యూజీసి నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై కాకతీయ విశ్వవిద్యాలయం సిడీసి అధికారులు కనీస తనిఖీలు నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ విద్యార్థుల నుండి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు ఫీజులు వసూళ్లు చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షుడు బోడ అభిమిత్ర, నాయకులు గగన్,వికాస్,ప్రభు కళ్యాణ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.