Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలిన ఇండ్లను పరిశీలించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-ముదిగొండ
మండలంలో పలు గ్రామాలలో గురువారం అకాల గాలి బీభత్సం వర్షం కురిసి అటు రైతులను, ఇటు పేదల తీవ్రంగా నష్టపరిచి వాహనదారులను ఇక్కట్లకు గురిచేసింది. ప్రధానంగా ముదిగొండ గ్రామంలో తీవ్ర స్థాయిలో వీచిన గాలులకు ప్రధాన అంతర్గత రహదారులపై నేలమట్టమైన వృక్షాలు, విద్యుత్ పోల్స్, విరిగి తీగలు తెగిపడి, విద్యుత్‌కు అంతరాయం కలిగింది. నిరుపేద ఇండ్లు(రేకుల షెడ్లు) రేకులు గాలికి లేచిపోయి రోడ్డుపై పడినాయి. సిమెంట్ బిల్లలతో నిర్మాణం చేసిన ఇండ్లు పూర్తిగా నేలమట్టమై ఇంట్లో వస్తువులు ధ్వంసమై పేదలకు నష్టం వాటిల్లింది. అకాల గాలి వాన బీభత్సానికి ఇల్లు కూలిపోయిన నిరుపేదలకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా సిపిఐ(ఎం) నాయకులు వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, ఆర్ఐ ఎస్కే వహీదాబేగం అకాల గాలి వాన బీభత్సానికి ముదిగొండ గ్రామంలో నేలమట్టమైన పేదల ఇండ్లను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఇండ్ల కూలిన వారితో మాట్లాడారు. అనంతరం వైసిపి మంకెన దామోదర్ మాట్లాడుతూ గాలివాన బీభత్సానికి నేలమట్టమైన పేదల ఇండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. సిపిఐ (ఎం) పేదలకు అండగా ఉంటదని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామంలో అకాల గాలి బీభత్సానికి పేదలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇండ్లు కూలిన వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకులు వేల్పుల లక్ష్మణ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మల్లారపు నరేష్, వీఆర్ఏలు నాగరాజు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.