Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమంటున్న బాధితుడు
- సారీతో సరిపెట్టిన రూరల్ ఏఈ
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బుగ్గపాడుకు చెందిన ఓ రైతు పాడిఆవు విద్యుత్ ట్రాన్స్ఫారంకు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదం బుగ్గపాడు నుంచి ఆసన్నగూడెం వెళ్లే దారిలో ఓ రైతు పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫారం వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం కారణంగా తన ఆవు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిందని బాధిత రైతు మోదుగుమూడి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... సిమెంట్ వరలపై ఏర్పాటు చేసిన ఆ ట్రాన్స్ఫారం ఎత్తు పట్టమని మూడడుగులకు మించి ఉండకపోగా ప్రమాదకరంగా ఉందని సమీప రైతులు పలుమార్లు విత్యుత్శాఖ వారికి చెప్పినా పట్టించుకోలేదని రైతులు అంటున్నారు. వరికోతలు పూర్తయి సుమారుగా నెలరోజులు దాటింది. ఈ నేపధ్యంలో ఆ ట్రాన్స్ఫారానికి విద్యుత్ సరఫరాను నిలిపి వేయాల్సి ఉండగా ఆ దిశగా సంబంధిత లైన్మెన్లు గాని, రూరల్ ఏఈ గాని పట్టించుకోలేదని వారంటున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ షాక్‌తో పాడిఆవు మరణించిందని తెలిసిన సంబంధిత రూరల్ ఏఈ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. బాధిత రైతుకు సారీ చెప్పి అక్కడి నుంచి జారుకున్నారని బాధితుడు బాలకృష్ణ తన బాధను వ్యక్తం చేశారు. ఆవుకు 3నెలల దూడ ఉందని, రోజు పాలిస్తుందని, విలువ సుమారుగా రూ. 80వేలు ఉంటుందని రైతు బాలకృష్ణ తెలిపారు. విద్యుత్‌శాఖ వారు తనకు నష్టం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.