Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా అధ్యక్షతన నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం 20 చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన కేజీబీవీ ఇంగ్లీష్ మీడియం, ఆళ్ళపల్లి హైస్కూల్, మర్కోడు బాలుర ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వరుసగా వి.పద్మ, వీరన్న, వై.నాగేశ్వర్‌రావులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శాలువాలతో ఘనంగా సత్కరించారు. 100 శాతం ఉత్తీర్ణతకు ఎంతో కష్టపడి బోధించిన పాఠశాలల సిబ్బందిని రేగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆసరాగా, దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. తదనంతరం ఆళ్ళపల్లిలో ప్రముఖ వ్యాపారస్తుడు నరెడ్ల వెంకన్న, ఉమాదేవిల కుమారుడు సాయి అక్షిత్ రిసెప్షన్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు రేసు రాము, ఆళ్ళపల్లి వార్డు సభ్యురాలు సాంబలక్ష్మి జ్యేష్ఠ పుత్రిక హర్షిత ప్రధానం, పసుల గంగయ్య కుమార్తె లక్ష్మీ భవాని ప్రధానం వేడుకలకు హాజరై, నూతన వధూవరులను, కాబోయే వధువులను అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. అలాగే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మద్దెల రామదాసు తండ్రి మల్లేషం ఇంటికి చేరుకొని, యోగ క్షేమం తెలుసుకుని, భరోసా కల్పించారు. మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు చందా హరికృష్ణ మేనకోడలు సృజన రిసెప్షన్‌కు హాజరై, నూతన దంపతులను దీవించారు. అనంతరం మండలంలో ఈనెల 21వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కోసం స్థల పరిశీలన స్వయంగా చేశారు. దీనికి ముందు స్థానిక పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, పార్టీ బలోపేతానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివద్ధి పనులను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, ఎంపీడీవో రామారావు, సర్పంచ్‌లు గొగ్గెల ప్రేమకళ, శంకర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా, బీఆర్ఎస్ మండల నాయకులు ఎండీ అతహార్, బుర్ర వెంకన్న, మొహమ్మద్ ఖయ్యూం, కేవీఆర్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.