Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల గట్టి నిఘా
- ఆంధ్రాకు తరలుతున్న పందెంరాయుళ్లు
- గిరిజన పద్ధతిలో జతల కోళ్ల ఆట
నవతెలంగాణ-దమ్మపేట
పండుగలు, కొత్తలకు సంబరాలు చేసుకోవడం గిరిజనుల ప్రధాన సంప్రదాయం. అందులో భాగంగానే రెండు కోళ్లను ఒకచోట చేర్చి ఎటువంటి ఆయుధాలూ కట్టకుండా పందేలను నిర్వహించి గిరిజనులు ఆనందిస్తా రు. ఈ సాంప్రదాయమే కాలగమనంలో మారిపోయింది. రాను రాను కోళ్లకు కత్తులు కట్టి పోటీలు నిర్వహించి పందేలు కాయడంతో ఇది కాస్తా కోడిపందేలుగా రూపాంతరం చెందింది. వాస్తవంగా గిరిజనులు తమ పనులన్నీ తీర్చుకుని సాయంత్రం సమయంలో ఈ కోడిపందేలు నిర్వహించేవారు. అది వారి మానసిక ఉల్లాసానికి, పోరాట పటిమకు చిహ్నంగా భావించారు. రెండు కోడిపుంజుల్లో ఏదైతే ముందుగా అలిసిపోయి కిందపడిపోతుందో దాని యజమాని ఓడినట్లు లెక్క. ఈ ఆటకాస్తా భారీస్థాయి నగదులు పెట్టి కోడిపందేలు నిర్వహించే స్థాయికి వెళ్లింది.
గిరిజనులు ఎడమచంకలో కోడిని పెట్టుకెళితే గెలుపు ఖాయం...
గిరిజనులు ఎడమ చంకలో కోడిని పెట్టుకుని వెళితే గెలుపు ఖాయమని వారి నమ్మకం. దీనికి ప్రత్యేక ఒక శాస్త్రమే ఉంది. దీనినే కుక్కుట శాస్త్రమంటారు. సంస్కృతంలో కుక్కుట అంటే కోడి అని అర్ధం. ఈ కుక్కుట శాస్త్రం ప్రకారం...దాదాపు సుమారు 50 రకాల కోళ్లు ఉంటాయి. ఈ పందానికి మేపే కోడిపుంజుల పోషణ కూడా అతిఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. పందెంరాయుళ్లు తమకు ఇష్టంగా కోడిపుంజులను ప్రత్యేకంగా పెంచుతుంటారు. వీటికి శాస్త్రప్రకారం బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, మాంసం ముక్కలను ఆహారంగా ఇస్తూ ఉంటారు. కోడిపుంజుల ఎముకల పరిపుష్టి కోసం రాగులు, సోళ్లుతో చేసిన పిండి ఉండలను తినిపిస్తూ ఉంటారు. వీటితో పాటు మొలకెత్తిన తృణధాన్యాలను వీటికి ఆహారంగా అందిస్తారు. కోడిపుంజుల రెక్కలు బలంగా ఉండటానికి ప్రతినిత్యం అరగంట సమయం నీటితొట్టెల్లో, చెరువుల వద్ద ఈతలు కొట్టిస్తుంటారు. దీంతో రెక్కలు బలంగా ఉండి పందెంలో గెలవడం ఖాయంగా భావిస్తారు పందెంరాయుళ్లు. కోళ్లకు సీజన్ల వారీగా దంపుడు బియ్యంతో తయారుచేసిన ప్రత్యేక ఆహారం పెడతారు. నవంబర్ నుంచి జనవరి వరకు శరీర పటుత్వం కోసం నల్లనువ్వులతో చేసిన బెల్లం కలిపిన ఉండలను తినిపిస్తారు. ఆరోగ్య సమస్యలెదురైనప్పుడు ప్రత్యేకంగా ఇంజక్షన్లు, పొడవాటి గొట్టాలను కోడికి అందిస్తారు. ఈ పందెంకోళ్లను ఇతర పెట్టలతోనూ, కోళ్లతోనూ కలవనివ్వకుండా ప్రత్యేకంగా పెంచుతారు. కుక్కుట శాస్త్రం ప్రకారం...ఆదివారం పుష్యమి నక్షత్రం...పౌర్ణమి రోజున కాకి, కాకిడేగ, పచ్చకాకి జాతులు గల కోళ్లు పందేనికి వెళ్లినట్లయితే విజయం ఖాయమని చెప్పబడుతోంది.
రెండు రకాల పందేలు...
వీటికి పందేల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ముసుగుపందెం...రెండవది ఒడిపందెం...ముసుగు పందెం అంటే పందెంరాయుళ్లు మహామజాగా ఎంజారు చేస్తుంటారు. కోడికి కళ్లు కనబడకుండా గంతలు కట్టి...రెండుకాళ్లకు సైతం పదునైన కత్తులు కట్టి పందెం బిరిలోకి వదులుతారు. ఒడి పందెం అంటే కోడి కాలుకు ఒకదానికి మాత్రమే కత్తికట్టి కోళ్లను బిరిలోకి వదులుతారు. ముసుగులు లేకుండా రెండు కాళ్లకు కత్తులు కట్టే పద్ధతిని ఆరెళ్ల పందెం అంటారు. ఈ పందెంలో కోడిపుంజు ఎడమకాలితో పందెంలోని కోడిని పొడిచినట్లయితే దానికి ఊపిరి ఉన్నా కూడా పందెం ఓడినట్లు లెక్క. ఈ పందేలకు ఉపయోగించే కత్తులు రెండున్నర అంగుళాల నుంచి కోడి ఆకారాన్ని బట్టి కత్తులు సైజు పెరుగుతూ వస్తోంది. ఈ కత్తులను ప్రధానంగా తేనెతో సానబడతారు. అనంతరం ఆముదంలో నానబెట్టి కాచిన నీటిలో కడిగి శుభ్రపరిచి పందెం సమయంలో కోళ్లకు కడతారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రంగురంగుల ఈకలతో పందెంకోళ్లు ఆకర్షణీయంగా శరీరం మీద ఈకలు వత్తుగా, ముక్కు ధృఢంగా, పొడవుగా, దట్టమైన పొడవైన ఈకలతో, కాళ్లు నిటారుగా, పొడవుగా, కాలితొడలు బలిష్టంగా, కూత గంభీరంగా...కోపం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయని శాస్త్రం చెబుతోంది.
కోడిపుంజుల్లో రకాలు...
కుక్కుట శాస్త్రం ప్రకారం కోడిపుంజుల్లో రకాలు ఉన్నాయి. పచ్చకాకి, నెమలి, డేగ, నల్లడేగ, ఎర్రనెమలి(దీనినే కాకిడేగ అంటారు), నల్లమైల, పింగణి, కోలా, పర్ల ఇలా సుమారుగా 50 రకాలు ఉంటాయి. సాధారణంగా పందెంకోళ్ల పెంపకానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. పందెపు కోళ్లను డింకీలు అంటారు. పందెంరాయుళ్లు కుక్కుట శాస్త్రాన్ని చూసుకుని మరీ పందేలకు బయలుదేరడం ఆనవాయితీగా వస్తోంది. ఈ శాస్త్రంలో ఏ వారం...ఏ నక్షత్రం...ఏ తిథి...ఏఏ సమయాల్లో కోళ్లరంగులను బట్టి పందెం వేస్తే గెలుస్తాయో సమస్త విషయాలు ఉంటాయి. కోడిపందెంతో పాటు మట్కా, పేకాట, గుండుపట్టాలు ఏర్పాటు చేయడంతో పందెంరాయుళ్లు లక్షల రూపాయలు పోగొట్టుకునే వారుంటారు. లక్షలు గెలిచే వారుంటారు.
గిరిజన పల్లెల్లో సాంప్రదాయబద్ధంగా కోడిపందాలు
సంక్రాంతి పండుగ నెలరోజుల ముందుగానే గిరిజన పల్లెల్లో సాంప్రదాయ బద్ధంగా కోడిపందాలు జరిగేవి. ఎప్పటి మాదిరిగానే పందెంరాయుళ్లు తమ పెంపుడు కోడిపుంజులకు బలమైన పోషకవిలువలతో కూడిన ఆహారం అందించడంతో హుషారుగా...బలిష్టంగా తయారై పందేలకు కాలుదువ్వుతున్నాయి. ఈ ఏడాది పోలీసు యంత్రాంగం ముందస్తుగానే కోడిపందేల స్థావరాలపై గట్టి నిఘా పెట్టడంతో మండలంలోని కోడిపందేల రాయుళ్లు ఆంధ్రాబాట పడుతున్నారు. గతంలో మండలంలో పదేలు జోరుగా సాగేవి. జీడి, మామిడితోటల్లో కోడిపందాల బిర్రులు ఏర్పాటు చేసి బహిరంగంగా, యధేచ్ఛగా కోడిపందాలు నిర్వహించేవారు. ఈ స్థావరాల వద్ద గుండుపట్టాలు, కోసాట భారీగా జరిగేవి. దీంతో సంక్రాంతి పండుగ వారం రోజుల ముందునుంచే జూదరులు, పందెంరాయుళ్లతో ఆయా గ్రామాల్లో కోలాహల వాతావరణం కనిపించేది. ఈ ఏడాది మాత్రం పోలీసులు దమ్మపేట ప్రాంతంలో కోడిపందేలపై ఉక్కుపాదం మోపారు. నెలరోజుల నుంచి మండలంలో పేరొందిన పందెంరాయుళ్లను పోలీసుస్టేషన్‌కు పిలిపించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పలువురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. దీంతో కొంత తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ మారుమూల గిరిజన గ్రామాల్లోని కొండలు, గుట్టల మధ్య చాటుమాటుగా అడపాదడపాగా కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది పక్క రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో జరిగే పందేలకు తరలిపోతున్నారు.